లక్నో: ఒక బాలుడు చిన్నప్పుడు కిడ్నాపయ్యాడు. కొన్నేళ్లుగా గొర్రెల యజమాని వద్ద పనులు చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు సొంతూరుకు తిరిగి వచ్చాడు. చివరకు పోలీసుల సహాయంతో కుటుంబం వద్దకు చేరుకున్నాడు. (man reunites with family) ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 1993లో 8 ఏళ్ల రాజు తన అక్కాచెల్లెళ్లతో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఒక సోదరితో గొడవ జరుగడంతో మార్గమధ్యలో ఆగిపోయాడు. సోదరిలు వెళ్లిపోగా ఒక రాయిపై కూర్చొన్నాడు.
కాగా, లారీలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు తీసుకెళ్లారు. అక్కడ పొలాల్లో కూలీగా పని చేయించారు. ఒక భూస్వామి వద్ద గొర్రెలు మేపాడు. అతడు పారిపోకుండా రాత్రుళ్లు సంకెళ్ళు వేసేవారు.
మరోవైపు 30 ఏళ్లుగా జైసల్మేర్‌లో గొర్రెలు కాసిన అతడు ఒక వ్యాపారికి తన బాధ చెప్పుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు సహాయం కోరాడు. గొర్రెలు కొన్న ఆ వ్యాపారి వాహనంలో ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి రైలులో ఘజియాబాద్ చేరుకున్నాడు.
కాగా, ఘజియాబాద్ విస్తరించడంతో తన ఇంటికి ఎలా చేరుకోవాలో రాజు అలియాస్ భీమ్ సింగ్‌కు అర్థం కాలేదు. దీంతో కొంతమంది స్థానికుల సహాయంతో ఖోడా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తన కుటుంబం నుంచి ఎలా విడిపోయాడో వివరించాడు.
మరోవైపు రాజు గోడుపై పోలీసులు స్పందించారు. 1993లో మిస్సింగ్ కేసు ఫిర్యాదులను పరిశీలించారు. అతడి అదృశ్యంపై తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు ఆమెను పిలిపించారు. దీంతో కుటుంబంతో కలిసి వచ్చిన తల్లి తన కుమారుడ్ని గుర్తుపట్టింది. అతడ్ని హత్తుకుని కన్నీటిపర్యంతమైంది.