PM Modi | న్యూఢిల్లీ, నవంబర్ 14: దేశంలోని అన్ని రాజ్యాంగ, స్వయంప్రతిపత్తి సంస్థలను కేంద్రంలోని మోదీ సర్కారు భ్రష్టుపట్టిస్తున్నది. న్యాయవ్యవస్థ నుంచి దర్యాప్తు సంస్థల వరకు, గవర్నర్ల వ్యవస్థ నుంచి కాగ్ వరకు అన్ని వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. తాజాగా దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా ఉన్న ఐఐఎంల స్వతంత్రతకు చెల్లుచీటి ఇచ్చి, వాటిపై రాష్ట్రపతికి విశేష అధికారాలు కల్పించడం చర్చనీయాంశం అయింది. మోదీ సర్కార్ తీరుపై మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ వర్గాల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నియంతృత్వ ధోరణికి ఇది దారితీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఐఐఎంలపై రాష్ట్రపతికి విశేషాధికారాలు కల్పిస్తూ కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐఐఎం స్వతంత్రతను దెబ్బతీసేలా తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని అన్ని ఐఐఎంలకు రాష్ట్రపతి ‘విజిటర్’గా ఉంటారు. బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్, డైరెక్టర్ల నియామకం లేదా తొలగింపుపై రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. బోర్డును రద్దు చేసే అధికారం కూడా రాష్ట్రపతికి కల్పించారు. కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి సెర్చ్ ప్యానెళ్ల నియామకం, పాలసీ నిర్ణయాలు, వార్షిక బడ్జెట్ల ఆమోదం, ఫీజుల నిర్ణయం వంటి అంశాలపై కూడా రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. అంతకుముందు ఈ బోర్డు రద్దు క్లాజ్ ఉండేది కాదు. డైరెక్టర్ల నియామకంలో బోర్డుకే పూర్తి అధికారం ఉండేది.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు, ఆయా రాష్ర్టాలపై పెత్తనం చేసేందుకు గవర్నర్ల ద్వారా బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, బెంగాల్ సహా పలు రాష్ర్టాల్లో గవర్నర్ల వైఖరి వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు కూడా ఇటీవల అక్షింతలు వేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటమాడుతున్నారని మండిపడింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. లేకపోతే వినాశకర పరిణామాలు తలెత్తుతాయి. అటువంటి ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఎన్నికల కమిషన్‌పై కూడా పెత్తనం చేయాలని, ఈసీని తమ అదుపాజ్ఞల్లోకి తీసుకోవాలని కేంద్రం చూస్తున్నది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల(ఈసీ) నియామకాలను నియంత్రించేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కమిషనర్ల నియామకాల త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని తొలగించింది. కొత్త బిల్లు ప్రకారం.. కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు సీజేఐ స్థానంలో క్యాబినెట్ మంత్రిని సభ్యుడిగా చేర్చింది. ఇది ఈసీ స్వతంత్రతను దెబ్బతీస్తుందని, ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మారుస్తుందని, తమకు ఇష్టం వచ్చిన వ్యక్తులను ఎన్నికల కమిషనర్లుగా నియమించుకొనేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుందని విపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి సుప్రీంకోర్టు, కేంద్రానికి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్ కొలీజియం స్థానంలో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) తీసుకురావాలని కూడా ప్రయత్నించింది. అయితే దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నదనే విమర్శలు ఉన్నాయి.
ఆర్థిక అవకతవకలను నిగ్గు తేల్చే కాగ్‌ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ సర్కార్ కంకణం కట్టుకొన్నది. కాగ్ స్వతంత్రతకు పాతర వేస్తున్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్‌కు కీలకమైన ఫీల్డ్‌వర్క్‌ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు గత నెల ‘మౌఖిక ఆదేశాలు’ జారీ చేయడం వివాదాస్పదమైంది. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతోపాటు ఆయుష్మాన్ భారత్, భారత్‌మాల పథకాల్లో జరిగిన అవినీతిని బట్టబయలు చేసిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లను కేంద్రం ఇటీవలే బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. మరోవైపు మోదీ పాలనలో కాగ్ నివేదికలు కూడా ఏటికేటికి తగ్గుముఖం పడుతున్నాయి. 2015లో కాగ్ 54 నివేదికలు విడుదల చేయగా.. 2023లో ఆ సంఖ్య 16కి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాగ్ స్వతంత్రత దెబ్బతినకుండా చూడాలని కోరుతూ 86 మంది మాజీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు ఇటీవల లేఖ రాశారు.
ఎన్నికల వేళ బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం సైన్యాన్ని, అధికారులను వాడుకొంటున్నది. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని ఇటీవల సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం దుమారం రేపింది. మరోవైపు తమ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం బ్యూరోక్రాట్లను కూడా రంగంలోకి దించింది. కేంద్ర ప్రభుత్వంలోని 12 శాఖలకు చెందిన అధికారులను రథ్ ప్రభారిస్(ప్రత్యేక అధికారులు)గా నియమించి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో వారి ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ‘మార్కెటింగ్’ చేసుకోవాలని పథకం రచించింది.
మోదీ సర్కార్ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం గురించి చెప్పనవసరం లేదు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను విపక్ష పార్టీల నేతలపైకి కేంద్రం ఉసిగొల్పుతున్నది. బీజేపీ నేతలపై వచ్చే అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ముందుకు కదలని దర్యాప్తు సంస్థలు.. విపక్ష పార్టీల నేతలపై తప్పుడు కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మోదీ సర్కార్ పాలనలో నమోదైన సీబీఐ, ఈడీ, ఐటీ కేసుల్లో దాదాపు 90 శాతం కేసులు విపక్ష నేతలపైనే కావడం గమనార్హం.