న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఎన్నికల ముందర రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటున్నది. దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని ఇటీవల సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం సద్దుమణకముందే తాజాగా బ్యూరోక్రాట్లను కూడా కేంద్రం రంగంలోకి దించింది. కేంద్ర ప్రభుత్వంలోని 12 విభాగాలకు చెందిన అధికారులను రథ్ ప్రభారిస్ (ప్రత్యేక అధికారులు)గా నియమించి, వారి ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను ‘మార్కెటింగ్’ చేసుకొని రానున్న అయిదు రాష్ర్టాల శాసనసభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నది.
కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం నవంబర్ 20 నుంచి రెండు నెలల పాటు ఆదాయపన్ను, తపాలా, టెలికం, అటవీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో దేశంలోని 2.69 లక్షల గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా రూపొందించిన రథాల్లో తిరుగుతారు. ఎన్డీయే ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో సాధించిన విజయాలను ప్రచారం చేస్తారు. ఈ యాత్రలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, లబ్ధిదారులు కానివారిని వారు కలుస్తారు. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ప్రభుత్వ యంత్రాం గాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం పథకాల ప్రచారానికి సైనికులను, అధికారులను వాడుకోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులతో ప్రచారం నిర్వహించడం బ్యూరోక్రసీని రాజకీయికరణ చేయడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్ర సివిల్ సర్వీసుల(ప్రవర్తన) నియామావళి-1964 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకూడదని.. కేంద్రం తాజా నిర్ణయం దాన్ని ఉల్లంఘిస్తున్నదని తెలిపారు.
ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అధికారులను మార్కెటింగ్ కార్యకలాపాలకు వాడుకొంటున్నారని విమర్శించారు. ‘ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అన్ని శాఖలు, సంస్థలు, వ్యవస్థలు, విభాగాలు అధికారికంగా ‘ప్రచారక్‌లు” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.