న్యూఢిల్లీ, మే 18: నీట్-యూజీ 2026 ప్రశ్న పత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ఈ అంశంపై వివరణ ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఎన్టీఏ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్న రుణుకల్ కోచింగ్ సెంటర్
(ఆర్సీసీ) యజమాని ప్రొఫెసర్ శివరాజ్ మోటెగావ్‌కర్‌ను సీబీఐ సోమవారం అరెస్ట్ చేసింది. నీట్ పరీక్షలో మాక్ కెమిస్ట్రీ పేపర్ల నుండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయని విద్యార్థులను ఆయన అడుగుతున్న వీడియో వైరల్ అయిన తర్వాత ఆయనపై సీబీఐ దృష్టి పెట్టింది. నీట్ యూజీ పరీక్ష కోసం విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే ఈ సంస్థను మోటెగావ్‌కర్ నిర్వహిస్తున్నారు.
ప్రధాన బ్రాంచ్ లాతూర్‌లో ఉంది. ఎన్టీఏతో సంబంధాలు ఉన్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణికు మోటెగావ్‌కర్ సన్నిహితుడని సీబీఐ పేర్కొంది. కోచింగ్ సెంటర్‌తోపాటు మోటెగావ్‌కర్ నివాసంలో జరిపిన సోదాలలో ఒక కెమిస్ట్రీ గెస్ పేపర్ లభించింది. మే 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలే ఇందులో ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఆ కోచింగ్ సంస్థ 42 కెమిస్ట్రీ ప్రశ్నపత్రాల సెట్‌ను గెస్ పేపర్లుగా విద్యార్థులకు అందచేసినట్లు సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు 10 మంది నిందితులను ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, లాతూర్, అహ్లియానగర్లో అధికారులు అరెస్టు చేశారు. ఇదివరకు 9 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచి వారిని ప్రశ్నించే నిమిత్తం పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. 10వ నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు ప్రదేశాలలో సీబీఐ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటి విశ్లేషణ ప్రస్తుతం కొనసాగుతోంది. నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వశాఖు చెందిన ఉన్నత విద్య విభాగం ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా మే 12న సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సీబీఐ దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.
మరోవైపు ఇదే కేసులో పుణెకు చెందిన ఒక 46 ఏండ్ల బ్యూటీషియన్ ఉమ్మడి సూత్రధారిగా వెలుగులోకి వచ్చింది. ట్యూషన్ టీచర్ల కోసం వెతుకుతున్న విద్యార్థులను కమిషన్ కోసం ప్రతిష్టాత్మక పాఠశాలల ఉపాధ్యాయులతో ఆమె అనుసంధానించిందని, అలాగే పరీక్ష రద్దుకు దారి తీసిన లీకైన ప్రశ్నపత్రాన్ని పంపిణీ చేయడానికి ఈ పరిచయాలను ఉపయోగించుకుందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. పుణెలోని సుఖసాగర్ నగర్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మనీషా వాఘ్మారేను మరో కీలక నిందితుడైన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పీవీ కులకర్ణితోపాటు మే 14న అరెస్టు చేసి మే 16 నుంచి 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులలో ఒకరిగా సీబీఐ గుర్తించిన మూడో నిందితురాలు, నీట్-యూజీ 2026 కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రశ్నల తయారీ ప్యానెల్లో నిపుణురాలైన మనీషా గురునాథ్ మందారే(57)ను ఆదివారం ఢిల్లీ కోర్టు 14 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సోమవారం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని ఆందోళకారులు డిమాండ్ చేశారు. పోటీ పరీక్షల్లో జరుగుతున్న ఈ అక్రమాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఎన్ఎస్యూఐ కార్యకర్తలు మండిపడ్డారు. 2021, 2024, ఇప్పుడు 2026లో కూడా ఈ పేపర్ లీకేజీలు పరీక్షా వ్యవస్థను దెబ్బతీశాయని, అయినా ప్రభుత్వం ఈ సమస్యను తేలికగా తీసుకుంటున్నదని నిరసనకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నిద్రలేని రాత్రులు గడిపి, కష్టపడి చదివిన విద్యార్థులకు ఎవరు సమాధానం చెబుతారు?’ అని మరో నిరసనకారుడు ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నించారు.
నీట్ కేసుపై పార్లమెంటరీ కమిటీ సమీక్ష
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో సంస్కరణల అమలుతోపాటు నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసును సమీక్షించాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. విచారణ కోసం తమ ఎదుట హాజరుకావాలని ఎన్టీఏ చైర్పర్సన్ ప్రదీప్ కుమార్ జోషి, ఇతర అధికారులను పార్లమెంటరీ కమిటీ సోమవారం ఆదేశించింది. వివిధ అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు కేంద్రీకృత ప్రవేశ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏకు చెందిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ, సంస్కరణల అమలుపై విద్యా శాఖ ఉన్నతాధికారుల అభిప్రాయాలను విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ కమిటీ ఈ నెల 21న కోరనున్నట్లు రాజ్యసభ నోటీసులో పేర్కొంది.