Keralam CM : కేరళ నూతన ముఖ్యమంత్రి (Kerala New CM) గా సీనియర్ నేత వీడీ సతీశన్ (VD Sateesan) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ (Keral Governor) అర్లేకర్ (Arlekar) ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరువనంతపురం (Thiruvananthapuram) లోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రమాణస్వీకారంతో కేరళ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా సతీశన్ గుర్తింపు పొందారు.
ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు అంటే ఆదివారం నాడు సతీశన్ ప్రముఖ కార్డినల్ మోరన్ మోర్ బసిలియోస్ క్లెమిస్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కార్డినల్ క్లెమిస్ అందించిన దీవెనలు, శుభాకాంక్షలు తనకు ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయని సతీశన్ ఎక్స్ వేదికగా తెలిపారు. అన్ని వర్గాలను గౌరవిస్తూ, కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పారు. సతీశన్తో కలిసి మరో 20 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
దాంతో ముఖ్యమంత్రితో కలిపి కొత్త మంత్రివర్గంలో మొత్తం 21 మంది సభ్యులు అయ్యారు. ఇక ముఖ్యమంత్రి పదవి సహా కాంగ్రెస్ పార్టీకి 11 మంత్రి పదవులు దక్కాయి. మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) కు ఐదు మంత్రి పదవులు లభించాయి. ఐయూఎంఎల్ నుంచి పీకే కున్హాలికుట్టి, కేఎం షాజీ, ఎన్ షంసుద్దీన్, పరక్కల్ అబ్దుల్లా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) విజయం సాధించింది.