Compostable Bottles | తిరువనంతపురం: కేరళ సాగునీటి మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘గ్రీన్ బయో ప్రొడక్ట్స్’ స్టార్టప్ కంపెనీ త్వరలో పర్యావరణ హితమైన ఆర్గానిక్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ‘కంపోస్టబుల్ బాటిల్స్’ అని కూడా పిలిచే వీటిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరికొద్ది రోజుల్లో ఆవిష్కరించనున్నారు. పూర్తిగా నేలలో కలిసిపోయే బయోడీగ్రేడబుల్ పదార్థాలతో వీటిని తయారు చేయనున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న వీటిని ‘హిల్లీ ఆక్వా’ బ్రాండ్ పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.
గ్రీన్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ ఐదేండ్ల క్రితం ముంబై ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన ఓ ప్రొటోటైప్ కేరళ జలవనరుల శాఖ మంత్రి రోషీ అగస్టీన్‌ను ఆకట్టుకోవడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. కంపోస్టబుల్ వాటర్ బాటిళ్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను గ్రీన్ బయో ప్రొడక్ట్స్ సంస్థ సరఫరా చేయనుండగా ఆ బాటిల్స్‌ను కేఐఐడీసీ తయారు చేయనున్నది. ఇది కార్యరూపం దాల్చితే దేశంలో పర్యావరణ హితమైన వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా కేరళ నిలువనున్నది.