Kerala techie : కేరళ నుంచి వచ్చిన ఒక పర్యాటకురాలు కర్ణాటకలో ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయింది. నాలుగు రోజులైనా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె కోసం కర్ణాటక ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. కేరళకు చెందిన జీఎస్ శరణ్య అనే 36 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ కర్ణాటకకు సోలో ట్రిప్ కోసం వచ్చింది. కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని కక్కాబే అనే గ్రామంలో ఉన్న ఒక ప్రైవేటు హోం స్టేలో ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 2న తడియాండమోల్ అనే అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసం వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ అటవీ అధికారుల వద్ద రిజిష్టర్ చేసుకుంది.
ఈ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయని, సాయంత్రంకల్లా తిరిగి రావాలని అధికారులు ఆమెకు సూచించారు. మరో 10 మంది బృందంతో కలిసి వెళ్లి తిరిగి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె పేరు, వివరాలు నమోదు చేసుకుని అనుమతించారు. సాయంత్రం ఆమె మినహా అందరూ తిరిగొచ్చారు. దీంతో శరణ్య మిస్ అయినట్లు గుర్తించారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులు, అటవీ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పోలీసులు, అటవీ అధికారులు, యాంటీ నక్సల్స్ ఫోర్స్ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఆమెను వెతికేందుకు డ్రోన్లు కూడా వాడుతున్నారు. నాలుగు రోజులైనా శరణ్య ఆచూకీ దొరకలేదు. ఈ అంశంపై కేరళ సీఎం పినరయి విజయన్.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. వ్యక్తిగతంగా పర్యవేక్షించి, శరణ్యను గుర్తించాలని లేఖలో కోరారు. దీంతో సిద్ధరామయ్య కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకు ఆదేశాలు జారీ చేశారు. శరణ్యను వెతకాల్సిందిగా సూచించారు. దీనిపై స్పందించిన మంత్రి ఈశ్వర్ ఇందుకోసం ప్రత్యేక బృందాల్ని నియమించినట్లు తెలిపారు.
డ్రోన్లు, అదనపు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరోవైపు శరణ్య తప్పిపోవడంపై ఒక ప్రచారం జరుగుతోంది. శరణ్య, అడవిలోకి ఒంటరిగా వెళ్లిందని ప్రచారం మొదలైంది. కానీ, దీన్ని అక్కడి అటవీ అధికారులు ఖండించారు. తాము శరణ్యను ఇతర బృందంతో కలిసి వెళ్లాలని సూచించామని చెప్పారు. అలాగే, ఇతర బృంద సభ్యులకు మధ్యలో ఆమె కలిసినట్లు కూడా వెల్లడించారు. కానీ, తిరిగొచ్చే సమయంలోనే ఆమె మిస్సైందని పోలీసులు అంటున్నారు.