తిరువనంతపురం: అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ లావాదేవీలు నిర్వహించే అలెక్సీ బెసికోవ్ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. లిథువేనియా పౌరుడు, రష్యా నివాసితుడు అయిన బెసికోవ్.. తిరువనంతపురం సమీపంలోని ఓ హోమ్‌స్టేలో ఉంటున్న సమయంలో అతన్ని పట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లకు క్రిప్టో ద్వారా మనీల్యాండరింగ్ నిర్వహించే బెసికోవ్పై అమెరికాతో పాటు పలు దేశాల్లో కేసులు ఉన్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో బెసికోవ్ ఉన్నాడు. రష్యాకు చెందిన క్రిప్టో కరెన్సీ గారెంటెక్స్ సంస్థలో అడ్మినిస్ట్రేటర్‌గా చేశాడు. ఆ క్రిప్టో లావాదేవీలన్నీ అతనే చూసుకునేవాడని అమెరికా న్యాయశాఖ రిపోర్టు ద్వారా తెలిసింది.
ప్రస్తుతం బెసికోవ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. గారెంటెక్స్ సంస్థ కూడా స్పందన ఇవ్వడానికి నిరాకరించింది. రష్యాలో ఉండే బెసికోవ్ ఎందుకు ఇండియాకు వచ్చాడో స్పష్టంగా తెలియదు. అమెరికా చేసిన అభ్యర్థన మేరకు.. కేరళ పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. ఢిల్లీ కోర్టులో అతన్ని ప్రవేశపెట్టనున్నారు. అతన్ని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. జర్మనీ, ఫిన్ల్యాండ్తో కలిసి అమెరికా అతనికి చెందిన క్రిప్టో కంపెనీపై నిఘా పెట్టింది.
గారెంటెక్స్ లో 2019 నుంచి సుమారు 96 బిలియన్ల డాలర్ల క్రిప్టో లావాదేవీలు జరిగాయి. వందల మిలియన్ల డబ్బు అక్రమ రీతిలో వచ్చిందని, ఆ డబ్బుతో అనేక నేరాలకు పాల్పడ్డారని, లైసెన్స్ లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ వ్యాపారం చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.