న్యూఢిల్లీ, డిసెంబర్ 31: భారత్‌కు చెందిన కేరళ నర్సు నిమిష ప్రియ మరణ శాసనంపై యెమెన్ అధ్యక్షుడు రషీద్ అల్-అలామీ సంతకం చేశారు. నెల రోజుల్లో ఆమెకు ఈ శిక్షను అమలు చేయనున్నారు. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో నిమిష ప్రియ 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమెను విడిపించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
కేరళలోని పాలక్కడ్ జిల్లా కొల్లెంగోడ్‌కు చెందిన 36 ఏండ్ల నిమిష ప్రియ 2008లో తల్లిదండ్రుల సహకారంతో యెమెన్ వెళ్లింది. 2011లో ఆమెకు పెళ్లయ్యింది. అయితే ఆర్థిక కారణాలతో ఆమె భర్త, మైనర్ కుమార్తె 2014లోనే భారత్‌కు తిరిగి వచ్చేశారు. అదే సంవత్సరం ఆ దేశంలో అంతర్యుద్ధం చోటుచేసుకోవడంతో వారు తిరిగి యెమెన్‌కు వెళ్లలేక పోయారు. అక్కడ పలు దవాఖానలలో పనిచేసిన అనంతరం నిమిష చివరగా సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం సొంత సంస్థ ప్రారంభించడానికి స్థానికులకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 2014లో ఆమె స్థానిక పౌరుడైన తలై అబ్దో మహదిని భాగస్వామిని చేసుకుంది.
అనంతరం వ్యాపారంలో అతడు పెత్తనం చెలాయించడమే కాక, ఆమె తన భార్యని ప్రచారం చేశాడు. ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడు. అయితే ఇద్దరి మధ్య పడకపోవడంతో ఆమె మహదీపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అతడిని 2016లో అరెస్ట్ చేశారు. అయితే విడుదల అనంతరం కూడా అతడు తన బెదిరింపులు కొనసాగించాడు. దీంతో 2017లో కూడా తన భాగస్వామితో ఆమెకు విభేదాలు కొనసాగాయి. అతని దగ్గరున్న తన పాస్‌పోర్ట్‌ను పొందడానికి ఆమె మహదీకి మత్తు మందును ఇంజెక్ట్ చేసిందని, ఓవర్‌డోస్ కారణంగా అతడు మరణించాడని నిమిషపై ఆరోపణ వచ్చింది. అనంతరం దేశం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను యెమెన్ ప్రభుత్వం 2018లో అరెస్ట్ చేసింది. 2020లో ట్రయల్ కోర్టు ఆమెకు మరణ శిక్షను విధించగా, ఆ తీర్పును సుప్రీం కోర్టు 2023 నవంబర్‌లో సమర్థించింది.