న్యూఢిల్లీ: లెబనాన్‌లో పేజర్ల పేలుళ్ల సంఘటనలో కేరళ వ్యక్తి రిన్సన్ జోస్ (37) ప్రమేయంపై దర్యాప్తు జరుగుతున్నది. ఆయన కేరళలోని వయనాడ్‌కు చెందినవారు. ప్రస్తుతం నార్వేజియన్ పౌరుడు. ఆయన బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ లిమిటెడ్‌కు ఏకైక యజమానిగా రికార్డులు చెప్తున్నాయి. హెజ్బొల్లా ఉగ్రవాదులపై దాడుల్లో ఉపయోగించిన పేజర్లను సరఫరా చేసిన కంపెనీ ఇదే. దీనిపై బల్గేరియా దర్యాప్తు చేస్తున్నది.
వయనాడ్ డిప్యూటీ ఎస్పీ (స్పెషల్ బ్రాంచ్) పీఎల్ షిజు మాట్లాడుతూ, లెబనాన్ పేలుళ్లలో రిన్సన్ ప్రమేయంపై వార్తలు వచ్చిన తర్వాత ఆయన గురించి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన పేజర్ల పేలుళ్లలో 12 మంది మరణించగా, సుమారు 3,000 మంది గాయపడిన సంగతి తెలిసిందే. రిన్సన్ పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశారు. ఓస్లో మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో సోషల్ వెల్ఫేర్ అండ్ హెల్త్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.