కేరళ: భర్త మరణించిన తర్వాత అత్తింటి నుంచి గెంటివేసేందుకు ప్రయత్నించిన అత్తమామల వాదనలను తోసిపుచ్చుతూ, వితంతువుకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉందని కేరళ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. గృహహింస నిరోధక చట్టం 2025 ప్రకారం మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను ఈ తీర్పు నొక్కి చెప్పింది. 2009లో తన భర్త మరణించిన తర్వాత అత్తమామలు తనను వేధిస్తున్నారని, ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేరళకు చెందిన 41 ఏళ్ల మహిళ జ్యుడీషియల్ కోర్టును ఆశ్రయించింది.
కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చింది. అత్తమామలతో ఆమెకు ‘గృహ సంబంధం’ లేదని పేర్కొంటూ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆమె పాలక్కాడ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా అక్కడ ఆమెకు ఊరట లభించింది. అయితే, ఈ తీర్పును ఆమె అత్తమామలు హైకోర్టులో సవాలు చేశారు. కోడలికి వేరే ఆస్తి ఉందని, ఆమె తన పుట్టింట్లో నివసిస్తున్నదని, కాబట్టి ఆమె గృహహింస బాధితురాలు కాదని వాదించారు. జస్టిస్ ఎంబీ స్నేహలత నేతృత్వంలోని ధర్మాసనం వారి వాదనను తోసిపుచ్చింది.
మరణించిన వ్యక్తి భార్యగా గతంలో ఉమ్మడి కుటుంబంలో నివసించినందున గృహహింస చట్టం పరిధిలోని నిర్వచనాల పరిధిలోకి ఆమె వస్తారని స్పష్టం చేసింది. వివాదం తలెత్తిన సమయంలో ఆమె ఉమ్మడి గృహంలో నివసిస్తున్నారా? లేదా? ఆ ఇంటిపై ఆమెకు యాజమాన్య హక్కు ఉందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉన్నదని ధర్మాసనం స్పష్టం చేసింది.