Kerala High Court : అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని ఎలాగైనా బతికించుకోవాలనుంది ఆ అమ్మాయి. అందుకని తన కాలేయంలో కొంతభాగం ఇచ్చేందుకు సిద్ధపడింది. కానీ అందుకు వయసు అడ్డంకిగా మారింది. దాంతో ఆ అమ్మాయి హై కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆమెకు మినహాయింపు ఇస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సంఘటన కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది. దేవనంద అనే అమ్మాయి తండ్రి ప్రతీష్‌కు హెపటోసెల్యులోమ క్యాన్సర్ వచ్చింది. దాంతో ఆయన తీవ్రమైన కాలేయ జబ్బుతో బాధపడుతున్నాడు. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే ఆయన బతికే అవకాశం ఉంది. అయితే.. దేవనంద లివర్ మాత్రమే మ్యాచ్ అయింది. దాంతో ఆమె తన కాలేయం ఇచ్చేందుకు సిద్ధపడింది. కానీ, ఆమెకు 17 ఏళ్లు మాత్రమే ఉండడంతో డాక్టర్లు ఒప్పుకోలేదు. దాంతో దేవనంద అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్ వేసింది.
అవయవ దానం కోసం జరిపే వైద్య పరీక్షల్లో తాను ఫిట్‌గా ఉన్నట్టు తేలితే తనను పెద్ద అమ్మాయిగా పరిగణించాలని దేవనంద ఆ పిటిషన్లో పేర్కొంది. దేవనంద కేసును అధ్యయనం చేసేందుకు కేరళలోని అవయవదాన సంస్థ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అందులోని ముగ్గురు నిపుణులైన డాక్టర్లు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్ప మరో దారి లేదని, డోనేట్ చేయడం ద్వారా ఎదురయ్యే పరిణామాలు దేవనందకు తెలుసని చెప్పారు. దాంతో, కోర్టు దేవనంద దయా హృదయాన్ని మెచ్చుకోవడమే కాకుండా తండ్రికి లివర్ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ‘దేవనంద తన తండ్రిని బతికించుకునేందుకు చేస్తున్న పోరాటం అభినందనీయం. దేవనంద లాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు’ అని ఈ సందర్భంగా జస్టిస్ వీజీ అరుణ్ వ్యాఖ్యానించారు. 2014 అవయవదాన చట్టంలోని నియమం 18 పక్రారం ఆర్గాన్ డొనేట్ చేసేవాళ్లకు కనీసం 18 ఏళ్లు ఉండాలి.