తిరువనంతపురం: ఇజ్రాయెల్‌కు వెళ్లిన ఒక రైతు ప్రతినిధి అక్కడ అదృశ్యమయ్యాడు. తాను క్షేమంగానే ఉన్నానని, తన గురించి వెతకవద్దంటూ కుటుంబానికి ఫోన్ చేశాడు. అయితే ఆ దేశంలో సెటిల్ అయ్యేందుకే అతడు కనిపించకుండా పోయాడని రైతు బృందం ఆరోపించింది. ఇజ్రాయెల్ వ్యవసాయ విధానాన్ని అధ్యయం చేసేందుకు కేరళకు చెందిన 27 మంది రైతులతో కూడిన బృందం నాలుగు రోజుల కిందట ఆ దేశానికి వెళ్లింది.
కన్నూర్ జిల్లాకు చెందిన 48 ఏళ్ల రైతు బిజు కురియన్ ఇజ్రాయెల్‌లో అదృశ్యమయ్యాడు. రైతు బృందం బస చేసిన హెర్జీలియా నగరంలోని హోటల్ నుంచి శుక్రవారం అతడు మాయమయ్యాడు. ఆ రైతు బృందానికి నేతృత్వం వహించిన వ్యవసాయ కార్యదర్శి బీ అశోక్ దీనిపై భారత ఎంబసీకి సమాచారం ఇచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన ఇజ్రాయెల్ పోలీసులు అదృశ్యమైన రైతు ప్రతినిధి కోసం వెతుకుతున్నారు.
కాగా, రైతు కురియన్ ఆదివారం కేరళలోని తన కుటుంబానికి ఫోన్ చేశాడు. తన భార్యతో మాట్లాడాడు. ఇజ్రాయెల్‌లో తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే తన కోసం వెతకవద్దని వారితో చెప్పాడు. అయితే కురియన్ వీసా మే 8 వరకు చెల్లుతుందని ఆ బృందంలోని ఇతర రైతు ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ అక్రమంగా సెటిల్ అయ్యేందుకే తమ బృందం నుంచి అతడు మాయమయ్యాడని వారు ఆరోపించారు.
మరోవైపు ఇజ్రాయెల్‌లో అదృశ్యమైన రైతు కురియన్‌పై కేరళ ప్రభుత్వం కూడా దర్యాప్తు చేపట్టింది. ఆ దేశానికి వెళ్లిన రైతు బృందంలోకి అతడు ఎలా చేరాడు అన్నది ఆరా తీస్తున్నారు. ఇలా జరిగి ఉండకూడదని కేరళ వ్యవసాయ మంత్రి పీ ప్రసాద్ తెలిపారు. తమ ప్రభుత్వానికి సిగ్గుచేటుగా ఉందని అన్నారు.
కాగా, కేరళ రైతు ప్రతినిధుల విలాసవంతమైన ఈ టూర్‌పై కొన్ని నెలల నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉండగా రైతు బృందాన్ని ఇజ్రాయెల్‌కు ఎలా పంపిస్తారంటూ ప్రతిపక్షాలు, ఇతర వర్గాలు ప్రశ్నించాయి. దీంతో వ్యవసాయ మంత్రి ప్రసాద్ ఈ పర్యటనకు తొలుత అనుమతి నిరాకరించారు. అయితే అధికార పార్టీ నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చింది. దీంతో సొంత ఖర్చులతో ఇజ్రాయెల్ వెళ్లేందుకు రైతు బృందానికి కేరళ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.