Covid Patient | తిరువనంతపురం : కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారి ప్రాణాలను కాపాడాల్సిన ఓ అంబులెన్స్ డ్రైవర్.. క్రూరమృగంలా ప్రవర్తించాడు. ఓ కరోనా రోగిని అంబులెన్స్‌లో తరలిస్తూ నిర్మానుష్య ప్రాంతంలో ఆపి.. ఆమెపై అత్యాచారం చేశాడు అంబులెన్స్ డ్రైవర్. ఆ డ్రైవర్ పట్ల కోర్టు తీవ్రంగా స్పందించింది. జీవిత ఖైదు విధించడంతో పాటు భారీ జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కయాంకులంకు చెందిన నౌఫాల్ వృత్తిరీత్యా అంబులెన్స్ డ్రైవర్. 2020 సెప్టెంబర్ 5వ తేదీన కరోనా బారిన పడ్డ ఓ అమ్మాయి(19)ని అడోర్ నుంచి పండలంకు తరలిస్తూ.. మార్గమధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో అంబులెన్స్‌ను నిలిపివేశాడు. ఆ తర్వాత ఆ యువతిపై డ్రైవర్ నౌఫాల్ అత్యాచారం చేశాడు. తప్పు జరిగిందని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, క్షమించాలని బాధిత యువతిని డ్రైవర్ కోరాడు. కానీ అదే రోజు కోవిడ్ సెంటర్లో ఉన్నతాధికారులకు బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై చెప్పింది.
క్షణాల్లోనే డ్రైవర్ నౌఫాల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. డ్రైవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. అయితే నౌఫాల్ నేర చరిత్రను కలిగి ఉన్నాడని, ఇలాంటి అఘాయిత్యాలకు గతంలో పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. మొత్తానికి పట్టణమిట్ట ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 11వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. నౌఫాల్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 1.08 లక్షల జరిమానా విధించింది.