ఎర్నాకుళం: కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగ(Raila Odinga) .. కేరళలో కన్నుమూశారు. ఎర్నాకుళం జిల్లాలోని కూత్తకూళంలో ఉన్న ఆయుర్వేదిక కంటి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. క్యాంపస్లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయన వయసు 80 ఏళ్లు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అండ్ రీసర్చ్ సెంటర్ పేరన్కొన్నది. గత అయిదు రోజుల నుంచి ఆయన ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె, పర్సనల్ డాక్టర్ ఉన్నారు.
కెన్యా రాజకీయాల్లో రైలా ఒడింగాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆయన 2008 నుంచి 2013 వరకు ప్రధానిగా పనిచేశారు. ఆయుర్వేదిక కంటి ఆస్పత్రిలో గతంలో ఆయన కుమార్తె చికిత్స తీసుకున్నది. ఆమె కంటిచూపు మెరుగైన నేపథ్యంలో అదే ఆస్పత్రిలో మాజీ ప్రధాని ఒడింగా కూడా చికిత్స తీసుకుంటున్నారు. మాజీ ప్రధాని రైలా ఒడింగా మృతి సమాచారాన్ని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్(ఎఫ్ఆర్ఆర్ఓ) ఆఫీసుకు తెలియజేశారు. అయిదుసార్లు ఆయన దేశాధ్యక్ష పదవి కోసం పోటీపడ్డారు. కానీ ఒక్కసారి కూడా నెగ్గలేదు.