న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తన (ఎల్జీ) వల్లే బీజేపీకి 104 సీట్లు వచ్చాయని, లేకుంటే 20 సీట్లు కూడా వచ్చేవి కాదని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా తనతో అన్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ తన వల్లే బీజేపీ ఢిల్లీలో ఏడు సీట్లను గెలుచుకుంటుందని చెప్పారని వెల్లడించారు. మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్జీ అడ్డుకోవడంపై విరుచుకుపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునేందుకు ఎల్జీ ఎవరు? అంటూ నిలదీశారు.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..
‘శిక్షణ కోసం ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అడిగేందుకు మీరెవరు(ఎల్జీ)? నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంను. తనను రాష్ట్రపతి నియమించారని ఎల్జీ అంటున్నారు. ఇది బ్రిటిష్ వారు వైస్రాయ్లను ఎంచుకున్నట్టేనని నేను జవాబిచ్చాను. అప్పట్లో ఇండియన్లకు పాలించడం చేతకాదని వైస్రాయ్లు అన్నారు. ఇప్పుడు ఢిల్లీవాసులకు పరిపాలించడం చేతకాదని మీరంటున్నారా?’ అని ఎల్జీని ప్రశ్నించారు. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు. రేపు మేం అధికారంలోకి రావొచ్చు. ఢిల్లీలో మా ఎల్జీ ఉండొచ్చు. కానీ మేం ఈ విధంగా ప్రవర్తించం’ అని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.