న్యూఢిల్లీ: రైల్వే ప్రమాదాల నిరోధక వ్యవస్థ ‘కవచ్’ లోకో పైలట్స్‌కు ఎంతో సహాయకారిగా నిలుస్తున్నది. రైలు వేగ నియంత్రణ, పర్యవేక్షణతోపాటు సిగ్నల్స్‌కు సంబంధించి సమస్త పనులూ ‘కవచ్’ చేపడుతుంది. దట్టమైన పొగమంచు, అనూహ్యమైన వాతావరణ పరిస్థితుల్లోనూ రైల్వే ప్రయాణం సాఫీగా సాగేలా ‘లోకో పైలట్’కు సాయం చేస్తుంది.
ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ‘ఎక్స్’లో శనివారం విడుదల చేశారు. దట్టమైన పొగమంచులో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న ఓ రైలులో..కవచ్ మానిటర్ ‘గ్రీన్ సిగ్నల్’ చూపటం అందులో కనిపించింది. సిగ్నలింగ్, రైలు వేగం నియంత్రణ, ప్రమాదాల్ని అడ్డుకోవటం, ‘లోకో పైలట్’ ప్రమేయం లేకుండా బ్రేక్స్ వేయటం..మొదలైన పనులను ‘కవచ్’ నిర్వహిస్తుంది.