శ్రీనగర్, జూన్ 20: కశ్మీర్ నుంచి తమను వెంటనే తరలించకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను శరణు కోరుతామని, ఆశ్రయం కల్పించాలని అడుగుతామని కశ్మీరీ పండిట్లు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. కశ్మీర్లో మైనారిటీలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కశ్మీరీ పండిట్ ఉద్యోగులు నెల రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమను లోయ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది భయంతో ఇప్పటికే కశ్మీర్‌ను వదిలివెళ్లిపోయారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం పండిట్ల డిమాండ్లను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కశ్మీరీ పండిట్లు కేంద్రానికి తాజా హెచ్చరిక చేశారు. ‘అంతర్జాతీయ శరణార్థి దినం సందర్భంగా కేంద్రానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడేదాకా మమ్మల్ని లోయ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి’ అని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ కశ్మీర్ నేత సంజయ్ కౌల్ పేర్కొన్నారు.