కశ్మీర్ ఫైల్స్… దేశ వ్యాప్తంగా సంచలన రేపుతున్న సినిమా. ఇప్పటికే ఈ సినిమాకు 140 కోట్లు వచ్చాయి. ఈజీగా 200 కోట్ల క్లబ్లో చేరుతుందని అంచనా. ప్రధాని మోదీతో సహా సమాజంలోని చాలా మంది తెగ మెచ్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వినోదపు పన్నును కూడా మినహాయించారు. ఇక.. బీజేపీ నేతలు ఈ సినిమాను బాగా ప్రోత్సహిస్తున్నారు. తమ తమ కార్యకర్తలకు ఉచితంగా కూడా చూపిస్తున్నారు. హర్యానాకు చెందిన రేవారీ గ్రామంలో ఓ బీజేపీ నేత ప్రజలకు ఉచితంగా సినిమాను చూపించారు.
ఈ నేపథ్యంలోనే కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి బీజేపీ నేతపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రజలకు ఈ సినిమాను ఉచితంగా చూపించడం నేరం కిందికే వస్తుందని ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యవహారాన్ని వెంటనే నిలిపేయాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. సృజనాత్మకతను నేతలు ప్రోత్సహించాలని అన్నారు. టిక్కెట్లు కొని, సినిమా చూడటమే నిజమైన జాతీయవాదమని, నిజమైన సేవ అని అగ్నిహోత్రి చురకలంటించారు.
‘కశ్మీర్ ఫైల్స్‌ను ఉచితంగా చూపించడం ఓ నేరం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఖట్టర్ గారూ.. వెంటనే ఇలాంటి వాటిని ఆపండి. సృజనాత్మకతను రాజకీయ నేతలు గౌరవించాలి. టిక్కెట్లను కొని, సినిమా చూడటమే నిజమైన జాతీయవాదం. నిజమైన సేవా దృక్పథం’ అంటూ కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు అగ్నిహోత్రి ట్వీట్ చేశారు.