చెన్నై: టీవీకే అధినేత విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన సభలో తొక్కిసలాట ప్రణాళిక ప్రకారమే జరిగిందని బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ ఆరోపించారు. నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రజలు అనుకుంటున్నారని, అయితే, దీనిని ఎవరో ప్రణాళిక ప్రకారమే సృష్టించినట్లు తనకు అనిపిస్తున్నదని చెప్పారు. విజయ్ సభకు వచ్చే అభిమానులు, ప్రజల సంఖ్య గురించి ప్రభుత్వానికి, పోలీసులకు ముందే తెలుసునని, అయినప్పటికీ ప్రభుత్వం సరైన స్థలాన్ని ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మౌనాన్ని వీడి, ఇప్పటికైనా స్పందించాలన్నారు. జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారని అధికారులు చెప్తున్నారని, ఇదంతా ప్రణాళికాబద్ధంగా సృష్టించినదే అయి ఉంటుందని ఆమె ఆరోపించారు. టీవీకే పార్టీ కూడా ఈ తొక్కిసలాట కుట్రపూరితమని వాదిస్తున్న తరుణంలో ఆ పార్టీకి మద్దతుగా బీజేపీ నేత మాట్లాడటం విశేషం. ఈ విషయంలో డీఎంకేను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు చేస్తున్నది.