బెంగళూరు: కర్ణాటకలో తమకు రిజర్వేషన్ కోటాను పెంచాలని కోరుతూ లింగాయత్ పంచమశాలి శాఖ మఠాధిపతి బసవజయ మృత్యుంజయ స్వామీజీ సారథ్యంలో నిరసనకారులు చేపట్టిన ఆందోళన మంగళవారం బెళగావిలో హింసాత్మకంగా మారింది. శీతాకాల సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీని ముట్టడించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా వారిని చెదరగొట్టేందుకు పోలీసలు లాఠీచార్జి చేశారు.
తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో అసెంబ్లీని దిగ్బంధిస్తామని హెచ్చరిస్తూ ఆందోళనకారులు విధాన్ సౌధకు బయల్దేరడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు బలప్రయోగం చేశారు. బీజెపీ నాయకులతోపాటు స్వామీజీని పోలీసులు ముందస్తు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రభుత్వ వాహనాలతోపాటు ఎమ్మెల్యేలకు చెందిన వాహనాలను సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసిన పంచమశాలి శాఖకు ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ ఉంది. దీన్ని 15 శాతానికి పెంచాలని వారు ఆందోళన చేపట్టారు.