Karnataka High Court | బెంగళూరు, డిసెంబర్ 18: కర్ణాటకలోని బెళగావిలో దళిత మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుమోటోగా విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు.. సమాజంలో సమిష్టి బాధ్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే బేటా పఢావో.. బేటీ బచావో అంటూ కొత్త నినాదాన్నిచ్చింది. బాలికలను గౌరవించాలని, రక్షించాలని బాలురకు తల్లిదండ్రులు బోధించినప్పుడే, బాలికల రక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నది. బెళగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో ఈ నెల 10న ఓ దళిత మహిళను(42) కొందరు నగ్నంగా ఊరేగించి కరెంటు స్తంభానికి కట్టి భౌతిక దాడి చేశారు. ఆమె కొడుకు అదే గ్రామానికి చెందిన మరో బాలికతో పారిపోయినందుకు ఆగ్రహం చెందిన బాలిక కుటుంబ సభ్యులు ఈ దాడి చేశారు. ఈ దాడిని 50-60 మంది గ్రామస్థులు మౌన ప్రేక్షకులుగా తిలకించారు తప్ప నిందితులను అడ్డుకోలేదు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మౌన ప్రేక్షకులుగా ఉన్న గ్రామస్థులపై జరిమానా విధించి, ఆ మొత్తాన్ని బాధితురాలిని అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సామూహిక బాధ్యత కోసం కొత్త చట్టాలు చేయాలని కోర్టు సూచించింది. ‘ఎంతో మంది ఘటనకు సాక్షులుగా ఉన్నారు. కానీ ఎవరూ ఏమీ చేయలేదు. ఇది సామూహిక పిరికితనం. దీన్ని సరిదిద్దాలి. కారణాలను కనిపెట్టి లా కమిషన్కు అందించాలి. వాళ్లు ఒక చట్టం రూపొందించాలి’ అని కోర్టు తెలిపింది.
మహాభారతంలో కూడా ఇలా జరగలేదు
అంతకుముందు ఈ ఘటనను అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై ప్రభుత్వాన్ని కోర్టు విమర్శించింది. ‘మిగతా మహిళల్లో నెలకొన్న భయం మాటేమిటి? ఈ దేశంలో తాను సురక్షితంగా లేనని ఆమె భావిస్తుంది. మహా భారతంలో కూడా ఇలా జరగలేదు. ద్రౌపదికి కృష్ణుడు సాయం చేశాడు. కానీ ఆధునిక ప్రపంచంలో సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దురదృష్టవశాత్తు ఇది దుర్యోధన, దుశ్శాసనులతో కూడిన ప్రపంచం’ అని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.