మాండ్య, జూన్ 10: భార్య, కుమారుడిని హత్య చేసిన ఒక వ్యాపారి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలో వస్త్ర వ్యాపారం చేసే ప్రభాకర్ (65).. భార్య జ్యోతి (55) కుమారుడు సంతోశ్ (28)ను సోమవారం రాత్రి హత్య చేసి తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెరిగిన అప్పులు, ఈఎంఐ బకాయిల బెడదతో పాటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్ పథకం కారణంగా వ్యాపారం జరగక అందులో నష్టాల పాలై తాను ఈ దారుణానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
భార్య, కుమారుడిని గొంతు పిసికి చంపిన తర్వాత తన దుకాణంలో ప్రభాకర్ ఉరేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మహిళలకు ఉచిత బస్ పథకం ఉండటంతో వారు నగరాలు, ఇతర ప్రదేశాలకు వెళ్లి షాపింగ్ చేసుకోవడంతో స్థానికంగా తమ వ్యాపారం దెబ్బతిందని అతడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఆయన కుమారుడు సంతోష్‌కు ఈ ఏడాది ఏప్రిల్ 26నే వివాహం జరిగింది. ఘటన జరిగే సమయంలో సంతోష్ భార్య మేఘన ఇంట్లోనే ఉంది. ప్రభాకర్, జ్యోతిలకు వివాహం కాని కుమార్తె ఉంది. ఆమె బెంగళూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నది. మాండ్య ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.