బెంగళూరు, డిసెంబర్ 18 : ముడా కేసుకు సంబంధించి ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడు తనపై ఒత్తిడి చేస్తున్నాడని, ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడని ఆయన తాజాగా ఆరోపించారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం మీడియాకు వెల్లడించారు. ‘డిసెంబర్ 13న ‘ముడా’కు సమీపంలో హర్ష అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతి వ్యక్తిగత సహాయకుడిగా తనను తాను హర్ష చెప్పుకున్నాడు. కేసు విచారణ సీబీఐకి అప్పగించాలంటూ పట్టుబట్టవద్దని, లోకాయుక్త విచారణ కొనసాగనివ్వాలని హర్ష నాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు’ అని స్నేహమయ కృష్ణ మీడియాకు చెప్పారు.
ఈకేసులో తమకు సహకరిస్తే, కావాల్సినంత డబ్బు ఇస్తామంటూ హర్ష ఆఫర్ చేశాడని ఆరోపించారు. ఇందుకు తాను ఒప్పకోకపోయేసరికి, మరుసటి రోజు తన ఇంటివద్ద తన కుమారుడ్ని కలుసుకొని..అతడిపైనా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పాడు. ముడా భూ కేటాయింపుల కుంభకోణంపై మొదట్లో ఆర్టీఐ కార్యకర్త స్నేహమయ కృష్ణ చేసిన ఫిర్యాదు..కేసు నమోదుకు దారితీసింది. అంతేకాదు కేసు విచారణను లోకాయుక్త నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆయన కర్ణాటక హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అత్యంత కీలకమైన ఆయన్ను ప్రలోభపెట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయి.