బెంగళూరు: కర్ణాటక శాసన సభ్యులు లంచ్ తర్వాత కునుకు తీసేందుకు ఈ అసెంబ్లీ సమావేశం నుంచి రిైక్లెనర్లు (వాలుగా అమర్చుకునే కుర్చీలు) ఏర్పాటు చేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. సమావేశాల సందర్భంగా చాలామంది లంచ్ తర్వాత సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా గైర్హాజరవుతున్నారని, దీనిని నివారించడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. మార్చి 3 నుంచి 21 వరకు జరిగే సమావేశాల కోసం తాత్కాలికంగా 15 రిైక్లెనర్లను అద్దెకు తెస్తున్నామన్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున వాటిని కొనుగోలు చేయకుండా కేవలం అద్దెకు మాత్రమే తీసుకువస్తున్నామన్నారు. సమావేశాలు ముగిసిన వెంటనే వాటిని పంపేస్తామన్నారు. శాసన సభ్యులకు లాబీ బయట టీ, కాఫీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ తెలిపారు.