Karnataka MLA -KSCA : మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడికి తెరలేవనుంది. స్టార్ ఆటగాళ్ల మెరుపులను కళ్లారా చూసేందుకు అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఆన్లైన్లో కొందరు నిమిషాల్లో, మరికొందరు గంటలకొద్దీ క్యూలైన్లలో నిల్చొని మరీ టికెట్లు సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కొందరు బెదిరింపులకు దిగుతున్నారు. కర్నాటక ఎమ్మెల్యే తమకు ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని, మైదానంలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ఆదేశించారు.
చిన్నస్వామి స్టేడియంలో శనివారం ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌తో ఐపీఎల్ మొదలవ్వనుంది. ఇప్పటికే మ్యాచ్ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్మడుపోయాయి. ఈ పరిస్థితుల్లో కర్నాటక ఎమ్మెల్యే టికెట్ల కోసం డిమాండ్ చేశారు. హుంగుండ్ శాసనసభ్యుడైన విజయానంద్ కషపనవర్ (Vijayananda Kashappanavar) గురువారం కర్నాటక క్రికెట్ సంఘానికి టికెట్ల గురించి కొన్ని ఆదేశాలిచ్చారు.
Bengaluru, Karnataka: Congress MLA Vijayananda Kashappanavar says, “The IPL match is going to start on the 28th of this month. Karnataka State Cricket Association has not been providing the tickets for the MLAs, ministers and their families. See, they are taking all the… pic.twitter.com/F4Hqs9v7nh
— IANS (@ians_india) March 26, 2026
‘మార్చి 28న ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకు కర్నాటక క్రికెట సంఘం టికెట్లు ఇవ్వడం లేదు. కానీ, ప్రభుత్వం నుంచి కేఎస్‌సీఏ అన్నిరకాల ప్రయోజనాలు పొందుతోంది. అయినా కర్నాటక క్రికెట్ సంఘం ఎమ్మెల్యేలను మాత్రం గౌరవవించడం లేదు. అందుకని మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.
ఐపీఎల్ టికెట్ల విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తారు. నేను వారి ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా. ఎమ్మెల్యేలకు కనీసం ఐదు టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరాను’ అని విజయానంద్ తెలిపారు. అంతేకాదు మైదానంలో తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము వీఐపీలం. అందరిలా మేము ఐపీఎల్ టికెట్ల కోసం క్యూలో నిల్చోలేం. మేము గత సీజన్లో ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వెళ్లాం. చాలాసేపు క్యూలో నిల్చున్నాం. సాధారణ ప్రజల మాదిరిగానే మమ్మల్ని గ్యాలరీలోకి పంపించారు. ఈసారి అలా జరగదు అని ఆయన కర్నాటక క్రికెట్ సంఘం తీరుపై విమర్శలు గుప్పించారు.
#WATCH | Bengaluru | Congress MLA Kashappanavar Vijayananda Shivashankarappa says, “There is an IPL match going to start on the 28th of this month. Karnataka State Cricket Association has not provided the tickets for the MLAs, ministers and their families. They are taking all the… pic.twitter.com/RO8IqZb3fk
— ANI (@ANI) March 26, 2026
ఎమ్మెల్యే విజయానంద్ కంటే మందు బీజేపీ ఎమ్మెల్యే ఆర్ అశోక్ కర్నాటక క్రికెట్ సంఘం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘కర్నాటక క్రికెట్ సంఘానికి 16.32 ఎకరాల భూమిని చాలా తక్కువ ధర (నెలకురూ.1,600)కే ఇచ్చాం. అయినా మ్యాచ్ టికెట్లకు మా నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వారి వద్ద కోట్లాది రూపాయలున్నాయి. వారు మమ్మల్ని దోచుకుంటున్నారు.
అలాంటి వారి కోసం ప్రభుత్వం మరో స్టేడియం నిర్మించాలని భావిస్తోంది. కచ్చితంగా కర్నాటక క్రికెట్ సంఘానికి తగిన గుణపాఠం చెప్పాలి’ అని అశోక్ ధ్వజమెత్తారు. ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖాదర్ స్పందిస్తూ .. ‘ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఐపీఎల్ టికెట్ల అంశం మీద ప్రభుత్వం తప్పనిసరిగా కేఎస్‌సీఏతో చర్చలు జరపాల’ని కోరారు. ఎమ్మెల్యేలకు కనీసం నాలుగైదు టికెట్లు ఇప్పించేలా చూడాలని స్పీకర్ సూచించారు.