బెంగళూర్ : పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ కర్నాటక మంత్రి, బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప తాజా వివాదానికి తెరలేపారు. బీజేపీ శివమొగ్గ నగర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో బీజేపీ కార్యకర్తలను ఎవరూ తాకేందుకు కూడా భయపడే స్ధాయిలో పార్టీ పటిష్టంగా మారిందని అన్నారు. అయితే మన మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా, గోవులపై దాడులకు పాల్పడుతున్నా మనం మౌనంగా భరించాలా అని ఆయన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించారు.
బీజేపీ ప్రతినిధులు గ్రామస్ధాయి నుంచి ప్రధాని కార్యాలయం వరకూ అన్ని స్ధాయిల్లో ఉన్నారని ఏం జరిగినా మౌనంగా ఉండే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. తాము ఎవరి విషయాల్లో తలదూర్చబోమని, తమకు సమస్యలు ఎదురైతే బ్రహ్మ చెప్పినా వినబోమని అన్నారు. మన సైనికులను చంపుతున్నా ఎవరూ మాట్లాడని రోజులకు కాలం చెల్లిందని ఇంతకింతా ప్రతీకారం తీర్చుకోవాలని పార్టీ కార్యకర్తలను కర్నాటక మంత్రి కోరారు. కార్యకర్తల సమక్షంలో మంత్రి ఈశ్వరప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది.