బెంగళూరు: ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, మంత్రి పేర్లను సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. దీంతో అక్రమ నగదు బదిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేశారు. (Karnataka Minister resigns) కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి సంస్థ (ఎస్టీ కార్పొరేషన్) అకౌంట్స్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మే 26న శివమొగ్గలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పొరేషన్‌కు చెందిన రూ.187 కోట్లను బ్యాంకు ఖాతా ద్వారా అనధికారికంగా బదిలీ జరిగినట్లు ఆయన ఆరోపించాడు. రూ.88.62 కోట్లు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఐటీ కంపెనీలకు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా అక్రమంగా మళ్లినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం సస్పెండైన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జేడీ పద్మనాభ్, అకౌంట్స్ ఆఫీసర్ పరశురామ్ జి దురుగన్నవర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుచిస్మిత రావల్ పేర్లను అందులో ప్రస్తావించాడు. కార్పొరేషన్ నిధులను అక్రమంగా బదిలీ చేసేందుకు ‘మంత్రి’ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సూసైడ్ నోట్లో ఆరోపించాడు.
కాగా, కర్ణాటక ప్రభుత్వం ఈ ఆరోపణలపై స్పందించింది. దీనిపై దర్యాప్తు కోసం గత వారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. అయితే ఈ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, మంత్రిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి బీ నాగేంద్ర గురువారం రాజీనామా చేశారు.