బెంగళూరు: ఆ ఇద్దరి మతాలు, దేశాలు వేరు. ఆన్లైన్ గేమ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారి పెండ్లికి దారితీసింది. చివరకు ఇద్దరినీ కటకటాలపాలు చేసింది. బెంగళూరు పోలీసుల కథనం ప్రకారం… పాకిస్థాన్‌కు చెందిన ఇక్రా జీవాని(19)కి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్ యాదవ్(26)కు ఆన్లైన్ లూడో గేమ్ ఆడే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికి ఇక్రాది పాకిస్థాన్ అని ములాయంకు తెలియదు. పెండ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు తనది పాకిస్థాన్‌లోని హైదరాబాద్ అని ఇక్రా చెప్పింది. అప్పటికే ఇద్దరూ గాఢ ప్రేమలో మునిగిపోయారు. పాకిస్థాన్ అమ్మాయి అయినా ఇక్రాను ములాయం వదలలేకపోయాడు. ఆమెను నేపాల్‌లోని కాఠ్మాండుకు రమ్మన్నాడు. ఇద్దరూ అక్కడే హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి బెంగళూరుకు చేరుకొని కొత్త కాపురం పెట్టారు. గత ఏడేండ్లుగా ములాయం ఇక్కడే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇక్రా తన పేరును రవా యాదవ్‌గా మార్చుకొని ఆధార్ కార్డు కూడా పొందింది. పాకిస్థాన్ అమ్మాయి బెంగళూరులో అక్రమంగా నివసిస్తున్నదని కర్ణాటక ఇంటెలిజెన్స్‌కు ఉప్పందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇక్రాను, ములాయంను అరెస్టు చేశారు. వీరి వివరాలు సరిగ్గా తెలుసుకోకుండానే ఇల్లు అద్దెకు ఇచ్చిన గోవింద రెడ్డి అనే ఇంటి యాజమానిపై కూడా కేసు బుక్కైంది.