G. Parameshwara | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కర్ణాటక కాంగ్రెస్‌లో కుర్చీలాట రసకందాయంలో పడింది. సీఎం పీఠంపై తమకున్న ఆసక్తిని సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను ఏ విధంగా అర్హుడిని కాదో చెప్పాలంటూ హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర ఏకంగా అధిష్ఠానాన్నే ప్రశ్నించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముడా, వాల్మీకి కుంభకోణాలతో పీకల్లోతు కష్టాల్లో చిక్కుకొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు.
తుమకూరులో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన జీ పరమేశ్వర సీఎం పదవిపై తనకున్న ఆసక్తిని బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. ‘బసవలింగప్ప, మల్లికార్జున స్వామి, కేహెచ్ రంగనాథ్, మల్లికార్జున ఖర్గే వంటి ఎందరో సీనియర్లు సీఎం పీఠానికి అర్హులు. ఆ మాటకొస్తే, నేను కూడా అర్హుడినే. అయితే, సీఎం పదవి మమ్మల్ని వరించదు. దళితులకు సీఎం పదవి అనేది అందని ద్రాక్షగానే ఉన్నది? సత్తా ఉన్నప్పటికీ నాలాంటి వారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వరు? ఒకవిధంగా, ఆ బస్సును (పదవిని) మేం మిస్ అయ్యామనిపిస్తున్నది’ అని పరమేశ్వర కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో ‘మీరు ఆ బస్సును ఇంకా మిస్ అవ్వలేదం’టూ కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు.
వరుస స్కాంలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవీగండం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోంమంత్రి జీ పరమేశ్వర, సీనియర్ మంత్రి సతీశ్ జార్కిహోళి సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరు కూడా చర్చకు వచ్చింది. అయితే, సిద్ధరామయ్య తర్వాత ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజికవర్గ సమీకరణాలను బేరీజు వేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్‌కు ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కిహోళి పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పరమేశ్వర పై వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.