Karnataka HM : బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర (G Parameshwara) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపై హోంమంత్రి పరమేశ్వర దిద్దుబాటు చర్యలకు దిగారు. తన మాటలకు మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని, నా వ్యాఖ్యలను వక్రీకరించే అవకాశం మరికొందరికి ఇవ్వనని, అందుకే ఆ వ్యాఖ్యలపై తాను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానని హోంమంత్రి పరమేశ్వర చెప్పారు. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో తానూ ఉంటానని, వారి క్షేమం కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని అన్నారు. తన మాటల వల్ల మహిళలు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
గతవారం సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని ఓ వీధిలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా.. ఒక వ్యక్తి ఒక్కసారిగా వెనకనుంచి వచ్చి వారిలో ఓ యువతిని అసభ్యంగా పట్టుకున్నాడు. యువతులు ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ఆ హఠాత్పరిణామానికి షాకైన యువతులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
కానీ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం బయటపడింది. దీని ఆధారంగా బెంగళూరు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనపై హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ.. బెంగళూరు లాంటి పెద్ద నగరాలలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు.
ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని హోంమంత్రి తెలిపారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. మహిళలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మానేసి, ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. అటు బీజేపీ నేతలు సైతం పరమేశ్వర మాటలపై తీవ్రంగా స్పందించారు.