న్యూఢిల్లీ: కర్నాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై నమోదు అయిన కేసులో విచారణను అడ్డుకుంటూ కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికల బాండ్ల(Electoral bonds)ను కొనాలంటూ కంపెనీలపై మంత్రి సీతారామన్‌తో పాటు మరికొందరు వత్తిళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇవాళ కర్నాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర మంత్రి సీతారామన్‌తో పాటు బీజేపీ నేతలపై నమోదు అయిన కేసును సీఐడీకి అప్పగించాలని బెంగుళూరు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ కేసులో స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ ఎం నాగప్రసన్న ఈ ఆదేశాలు జారీ చేశారు. జనాధికారా సంఘర్ష పరిషత్ (జేఎస్పీ) సంస్థ సహాధ్యక్షుడు ఆదర్శ ఆర్ అయ్యర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుగుతున్నది. ఐపీసీలోని 120బీ, 384 సెక్షన్ల ప్రకారం కుట్రపూరితంగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించారు. కానీ ఆ సెక్షన్ల కింద ఫిర్యాదుదారుడు నమోదు చేసిన కేసు చెల్లదని కోర్టు తెలిపింది.