Karnataka | కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ప్రభుత్వ ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. నిర్వహించే ముందు ప్రైవేటు సంస్థలు పరిపాలనా అనుమతులు పొందాలని కర్నాటక ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఉత్తర్వులను కర్నాటక హైకోర్డు ధార్వాడ్ బెంచ్ ఉత్తర్వులు నిలిపివేసింది. పునస్చైతన్య సేవా సమస్త అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ నాగప్రసన్న బెంచ్ విచారించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇస్తూ.. విచారణను నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది. సంస్థ తరపున సీనియర్ న్యాయవాది అశోక్ హర్నహళ్లి వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులపై పరిమితి విధించడమేనని వాదించారు.
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. 10 మంది కంటే ఎక్కువ మంది సమావేశమైతే ప్రభుత్వ అనుమతి అవసరమని.. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులపై పరిమితి విధించడమేనని.. ఒక పార్కులో కార్యక్రమం నిర్వహించినా.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అది చట్టవిరుద్ధమవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది స్పందించేందుకు సమయం కోరగా.. ఉత్తర్వులపై హైకోర్టు ధార్వాడ్ బెంచ్ మధ్యంతర స్టే విధించింది. కర్నాటకలో ఏదైనా ప్రభుత్వ ఆస్తి, ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రైవేటు సంస్థలు ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. 10 మందికి పైగా సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించడం, బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, ప్రభుత్వ ప్రాంగణాల్లో అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించడంపై నిషేధం విధించింది. హైకోర్టు స్టేపై బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్వాగతించారు. సిద్ధరామయ్య ప్రభుత్వానికి, ప్రియాంక్ ఖర్గేకు పెద్ద దెబ్బలాంటిదన్నారు.