బెంగుళూరు : కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. ధార్వాడ్లోని రంకా స్టెల్లో అపార్టుమెంట్లో ఉంటున్న డాక్టర్ ఎన్ని సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వట్లేదని బంధువులు తలుపులు బద్దలు కొట్టి ఫ్లాట్లోకి వెళ్లారు. అప్పటికే డాక్టర్ కిరణ్ హొనన్నవార్ (45) నేల మీద విగతజీవిగా పడి ఉన్నారు. ఒళ్లంతా రక్తపు మరకలు, కత్తిపోట్లు ఉన్నాయి. మరో గదిలో ఆయన ఎనిమిదేండ్ల కొడుకు ఒంటినిండా కత్తి పోట్లే ఉన్నాయి. కానీ ఆ బాలుడు ఊపిరితో ఉండటంతో వెంటనే ప్రైవేట్ దవాఖాన తరలించారు. అదే గదిలో హొనన్నవార్ భార్య డాక్టర్ ప్రియాంక రీల్స్ చూస్తోందని బంధువులు తెలిపారు.
పోలీసు వివరాల ప్రకారం.. హొనన్న వార్ అనస్థీషియాలజిస్ట్. ప్రియాంక కంటివైద్య నిపుణురాలు. మంగళవారం నుంచే హొనన్నవార్ బంధువుల ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. బంధువులు వచ్చి ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో ప్రియాంకనే భర్తను హత్య చేసి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.