(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ 40 ఏండ్ల మహిళ ఒకరు కగ్గలిపుర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మునిరత్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, వారం వ్యవధిలో మునిరత్నపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదవ్వడం కన్నడ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
తనను, తన కుటుంబంలోని మహిళలను మునిరత్న కులం పేరిట దూషించినట్టు చెలువరాజు అనే కాంట్రాక్టర్ కేసు పెట్టడంతో మునిరత్నపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కాగా, వాల్మీకి స్కామ్ పేరిట కాంగ్రెస్ సర్కారును చిక్కుల్లో పెట్టాలనుకొన్న బీజేపీ పరివారానికి మునిరత్న వ్యవహారం కొత్త చిక్కులను తీసుకొచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.