Congress | బెళగావి, మే 1: లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఈ విషయంలో వెనక్కు తగ్గే సమస్యే లేదని, తన మాటలకు కట్టుబడి ఉంటానని కుండ బద్దలు కొట్టారు. ఎమ్మెల్యే రాజు కాగే తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావి జిల్లాకు చెందిన కంగ్వాడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే తన నియోజకవర్గంలోని జుగులాటోలో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటేసి, చిక్కోడి లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని అల్టిమేటం జారీచేశారు. అలా జరుగకపోతే, గ్రామానికి కరెంట్ కట్ చేయిస్తానని ప్రజలకు హెచ్చరించారు. రాజు వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ ‘బెదిరింపుల దుకాణం’గా మారిందని విమర్శించింది. ‘మీ పనులు కావాలంటే నా తమ్ముడికే ఓటేయాలి’ ఇటీవల డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓటర్లను బెదిరించారని బీజేపీ అధికార ప్రతినిధి షేహజాద్ పునావాలా గుర్తుచేశారు.
రాజు కాగే 2019లో బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన పెట్టింది పేరు. మంగళవారం రాజు కాగే ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, మోదీ నినాదాలు ఇచ్చే కొంత మంది యువకులను విమర్శిస్తూ ‘ఒక వేళ రేపు మోదీ చనిపోతే? 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఇంకెవరూ ప్రధాని కాలేరా? దేశానికి ఆ సామర్థ్యం లేదా?’ అని వ్యాఖ్యానించారు. కాగా, రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ చనిపోవాలని కోరుకుంటుందా? అని కర్ణాటక బీజేపీ ఎక్స్ పోస్టులో ప్రశ్నించింది.