బెంగళూరు: కాలేజీ హాస్టల్లోని అమ్మాయిల బాత్రూమ్లో రహస్య కెమెరాను ఒక విద్యార్థి ఏర్పాటు చేశాడు. 1200కు పైగా నగ్న వీడియోలు రికార్డు చేశాడు. ఆ కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. హోసకెరెహళ్లి సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో శుభమ్ ఎం ఆజాద్ అనే విద్యార్థి బీఏ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో రహస్య కెమెరాను అతడు అమర్చాడు. తన మొబైల్ ద్వారా అమ్మాయిల నగ్న, అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు రికార్డు చేస్తున్నాడు.
కాగా, ఇటీవల సాయంత్రం వేళ రహస్య కెమెరాను సరి చేసేందుకు అతడు లేడీస్ బాత్రూమ్లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని బయట ఉన్న విద్యార్థినులు గమనించారు. దీంతో వారు బాత్రూమ్ తలుపును గట్టిగా తట్టినా లోపలున్న అతడు చాలా సేపటి వరకు తెరువలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు ఆ విద్యార్థినులు ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు శుభమ్ ఎం ఆజాద్‌ను గుర్తించారు. రెండు రోజుల కిందట కూడా అతడు లేడీస్ హాస్టల్ బాత్రూమ్ వద్ద కనిపించగా హెచ్చరించి వదిలేశారు. మరోసారి కూడా అలా చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆ విద్యార్థి మొబైల్ ఫోన్లో 1200కుపైగా అమ్మాయిల నగ్న, అర్ధ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందులో అతడ్ని గాళ్ఫ్రెండ్స్వి కూడా ఉన్నాయని చెప్పారు. ఆ విద్యార్థి వద్ద మరో మొబైల్ ఫోన్ కూడా ఉందని, అందులో మరిన్ని నగ్న వీడియోలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నదా అన్న దానిపై ఆ విద్యార్థిని ప్రశ్నిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.