Karnataka CM : కర్ణాటక సీఎం (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) తనయుడు యతీంద్ర (Yathindra) తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి రాజకీయ జీవితం చివరి దశలో ఉందని ఆయన చెప్పారు. అంతేగాక కర్ణాటకలో కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సతీశ్ ఝర్కిహోళి (Satish Jharkiholi) అర్హుడని ఆయన అభిప్రాయపడ్డారు.
యతీంద్ర వ్యాఖ్యలు కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కుమారుడే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బెళగావి జిల్లాలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో తన తండ్రి చివరి దశలో ఉన్నారని, ఈ సమయంలో బలమైన, ప్రగతిశీల భావజాలం కలిగిన నాయకుడు ఆయనకు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శకంగా ఉంటారని పేర్కొన్నారు. సతీశ్ ఝర్కిహోలికి ఆ లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి అని అన్నారు.
పెద్ద బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉండాలని యతీంత్ర చెప్పారు. పెద్ద బాధ్యత అంటే ముఖ్యమంత్రి మార్పును ఉద్దేశించే యతీంద్ర ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా సీఎం మార్పు అంశంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఇప్పటికే పరోక్షంగా వాగ్వాదం జరుగుతున్నది. ఈ సమయంలో సతీశ్ పేరు తెరపైకి రావడం గమనార్హం.