న్యూఢిల్లీ: తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనపై స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నం జరిగిందని..దాని వెనుక ఎవరున్నారో తాను ఆధారాలు సేకరించానని కర్ణాటక సీఎం శివకుమార్ గురువారం ఢిల్లీలో సంచలన విషయం వెల్లడించారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తన సహచర మంత్రులను ఈ విషయమై హెచ్చరించానని ఆయన తెలిపారు. వారిపైనా స్టింగ్ ఆపరేషన్ జరగవచ్చని ఆయన అన్నారు. గురువారం ఢిల్లీలో శివకుమార్ విలేకరులతో మాట్లాడారు.
‘బాధ్యతాయుత స్థానంలో ఉన్న నేను ఆధారాల్లేకుండా మాట్లాడకూడదు. నా వద్ద ఫొటోలు సాక్ష్యాలుగా ఉన్నాయి. దీని వెనుక సూత్రధారి ఎవరో, ఎవరు ఆర్థిక మద్దతు ఇస్తున్నారో, ఈ మొత్తం ఆపరేషన్ ఎవరు ప్లాన్ చేశారో నాకు తెలుసు’ అని శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం బీజేపీ ఫామ్ 7 దరఖాస్తులు సమర్పించడంపై స్పందిస్తూ దానిపై దర్యాప్తు చేయిస్తానన్నారు. బీజేపీ నాయకులు నేరపూరిత చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.