బెంగళూరు, మార్చి 11: శాసనసభ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన వేళ కర్ణాటక సీఎం బొమ్మై 1.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.900 కోట్లను శనివారం విడుదల చేశారు. బెంగళూరులో వెనకబడిన తరగతుల శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ కేవలం హామీలు ఇస్తే ప్రజల జీవితాలు మెరుగుపడవని అన్నారు. ‘గత ఏడు దశాబ్దాల్లో ఈ సౌకర్యాలను ప్రజలకు పంపిణీ చేసి ఉన్నట్టయితే ఇవాళ ఈ నిధుల విడుదల అవసరం వచ్చుండేదే కాదు. ఈ నిధులను ఉన్నత విద్య మీద ఖర్చు పెట్టి ఉండాల్సింది’ అని బొమ్మై అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏండ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నామని, ఈ ప్రక్రియను వీడియో రికార్డు చేస్తామని వెల్లడించింది. దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసేలా ఓ మొబైల్ అప్లికేషన్ తీసుకొచ్చామని తెలిపింది.