బెంగుళూరు: ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్ల(Muslim Contractors)కు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు కర్నాటక సర్కారు నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం ఆ రాష్ట్ర క్యాబినెట్ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది. కర్నాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకురానున్నారు. కేటీపీపీ చట్టంలో క్యాటగిరీ 2బీ కింద రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. క్యాటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారన్నారు. క్యాటగిరీ 1 కింద ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏ కింద వెనుకబడిన తరగతులు వారుంటారు.
కేటీపీపీ చట్టం ప్రకారం క్యాటగిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేర ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు అవుతారు. సీఎం సిద్ధరామయ్య చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ కర్నాటక బీజేపీ ఆన్లైన్లో ఆందోళన చేపట్టింది. హలాల్ బడ్జెట్ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ పార్టీ కామెంట్ చేసింది.
ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో సవరణ బిల్లును ప్రవేశపెట్టన తర్వాత.. ముస్లిం కాంట్రాక్టర్ల కోటాను అమలు చేస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఈ-ఖాతా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా సీఎం తెలిపారు. దీని కోసం పంచాయతీరాజ్ శాఖ ఆమోదం తెలిపిందన్నారు.