బెంగళూరు, సెప్టెంబర్ 2: బీజేపీపాలిత కర్ణాటకలో ‘కమీషన్ రాజ్’ వ్యవస్థ పెచ్చరిల్లుతున్న క్రమంలో ప్రధాని మోదీకి ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) టీవీ మోహన్‌దాస్ పాయ్ చేసిన విజ్ఞప్తి చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో రూ. 3,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి మోదీ శుక్రవారం కర్ణాటకకు వచ్చారు. ఈ క్రమంలో.. రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి రహిత కర్ణాటకకు కృషి చేయాలని మోహన్‌దాస్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘అభివృద్ధిపథంలో సాగే అవినీతిరహిత రాష్ట్ర ప్రభుత్వం మాకు కావాలి. లంచాలకు మరిగే అధికారులను తొలగించాలి. అవినీతికి పాల్పడే రాజకీయ నేతలను పక్కన పెట్టాలి. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేసి భవిష్యత్తులో సుపరిపాలన అందించాలి’ అని మోదీకి విజ్ఞప్తి చేశారు.