లక్నో: జనాన్ని భయంతో వణికించిన పులి 9 మందిని చంపింది. దానిని బంధించి జూకు తరలించారు. సుమారు 14 ఏళ్ల పాటు జూలో గడిపిన ఆ పులి 19 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో మరణించింది. (Tiger Dies In Zoo) దీంతో జూ సిబ్బంది శోకంలో మునిగిపోయారు. దానితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గురువారం జూ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు ఆ పులికి పూలతో నివాళి అర్పించి వీడ్కోలు పలికారు. 2010 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఒక పులి జనాన్ని బెంబేలెత్తించింది. గ్రామస్తులపై దాడి చేసి 9 మందిని చంపింది. ఆ ఏడాది అక్టోబర్ 14న అటవీశాఖ సిబ్బంది ఆ పులిని పట్టుకున్నారు. ఐదేళ్ల వయస్సున్న దానిని కాన్పూర్ జూకు తరలించారు. ఆ మగ పులికి ‘ప్రశాంత్’ అని పేరు పెట్టారు.
కాగా, గుజరాత్‌లోని శక్కర్బాగ్ జూ నుంచి తీసుకొచ్చిన ఆడ పులి త్రుషాతో ప్రశాంత్ జతకట్టింది. ఈ రెండు పులులు ఏడు పిల్లలకు జన్మనిచ్చాయి. కొన్ని పులి కూనలు కాన్పూర్ జూలో ఉండగా మరి కొన్ని దేశంలోని ఇతర జూలకు చేరాయి.
మరోవైపు ఒక పులి పిల్ల బాద్షా స్టార్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ అడవులకు దీనిని తరలించారు. 2016లో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీ ప్రారంభోత్సవం సందర్భంగా పులి కూన బాద్షాతో ప్రధాని మోదీ ఫొటో దిగారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిగతా పులి పిల్లలు అక్బర్, అమర్, అంబిక, ఆంథోనీలు కూడా తండ్రి ప్రశాంత్ వారసత్వాన్ని చాటాయి.