కాన్పూరు: అరవయ్యేళ్ల వృద్ధులను పాతికేళ్ల యువకులుగా మార్చుతామంటూ ఇద్దరు దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మి కలిసి రివైవల్ వరల్డ్ అనే థెరపీ సెంటర్ను ప్రారంభించారు. తాము ఇజ్రాయెల్లో తయారైన ఓ టైమ్ మెషీన్ను తీసుకొచ్చామని, దాని ద్వారా వృద్ధులను తిరిగి యువకులుగా మార్చుతామని ప్రచారం చేశారు.
దీని కోసం ఆక్సిజన్ థెరపీకి 10 సెషన్లకు రూ.6,000; మూడేళ్లపాటు చికిత్సకు రూ.90,000 చెల్లించాలని చెప్పారు. వీరి మోసానికి గురైన బాధితురాలు రేణు సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద రూ.10.75 లక్షలు తీసుకున్నారని, తనను మోసం చేశారని ఆరోపించారు. చాలా మందిని ఇలా మోసం చేసి, సుమారు రూ.35 కోట్లు దండుకున్నారని తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించడంతో ఈ దంపతులిద్దరూ విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.