Kalpana Soren | జార్ఖండ్‌లోని గండేయ్ అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కల్పనా సోరెన్ సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సతీమణే కల్పనా సోరెన్. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో ఆమెతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం చాంపై సోరెన్, జేఎంఎం కీలక నేతలు పాల్గొన్నారు.
గండేయ్ ఎమ్మెల్యే (జేఎంఎం) సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేయడంతో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై కల్పనా సోరెన్ 27 వేల ఆధిక్యంతో గెలుపొందారు. గత మార్చిలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
జార్ఖండ్ రాష్ట్రంలో విపక్ష ఇండియా కూటమి తరఫున కీలక నేతగా ఉన్న కల్పనా సోరెన్ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల హేమంత్ సోరెన్ అరెస్టైన తర్వాత సీఎంగా ఆమెకు పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా సీనియర్ నేత చాంపై సోరెన్.. సీఎంగా బాధ్యతలు చేపట్టారు.