Kalindi Express | ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ ఘటన కేసులో ఏటీఎస్ ఐజీ నీలాబ్జా చౌదరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టింది. అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో గ్యాస్ సిలిండర్, పేలుడు పదార్థాలను పెట్టి రైలు పట్టాలు తప్పేలా గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర పన్నిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఉన్న ఏడీసీపీ విజేంద్ర ద్వివేది, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అజయ్ త్రివేది కేసుకు సంబంధించిన ఇతర కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఆదివారం రాత్రి ఘటనా స్థలంలో గ్యాస్ సిలిండర్, పెట్రోలియం నింపిన గ్లాస్ బాటిల్ లభ్యమయ్యాయని, సమీపంలో దొరికిన ఓ బ్యాగ్‌లో మండే పదార్థాలు కూడా ఉన్నాయని ఏటీఎస్ ఐజీ నీలాబ్జా చౌదరి పేర్కొన్నారు. ఫోరెన్సిక్ బృందం సైతం కేసు విచారణను వేగవంతం చేసింది. పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నది. ఈ క్రమంలో 12 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు.
అదే సమయంలో సీసీ కెమెరాల ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో గుర్తు తెలియని దుండగులు పట్టాలపై గ్యాస్ సిలిండర్‌తో పాటు పేలుడు పదార్థాలను ఉంచగా.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ సెంట్రల్ మీదుగా హర్యానాలోని భివానీకి వెళ్తున్న సమయంలో ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్ ప్రాంతాంలో రైలు పట్టాలపై ఏదో అనుమానాస్పద వస్తువును లోకోపైలెట్ గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. అప్పటికే రైలు సిలిండర్‌ను ఢీకొట్టడంతో పట్టాలకు సుమారు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లయ్యింది. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలోనే పెట్రోల్ బాటిల్, అగ్గిపెటెట్ను సైతం గుర్తించారు. రైలును పట్టాలు తప్పేలా పక్కా ప్రణాళికతోనే ట్రాక్‌పై పెట్టినట్లుగా అధికార వర్గాలు తేల్చాయి.