తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కొత్త పూజారి(మేల్‌సంతి)గా కే జయరామన్ నంబ్రూదిని(melsanthi K Jayaraman Namboothiri) నియమించారు. నవంబర్ 16 నుంచి ఏడాది పాటు ఆయన అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన పూజారిగా కొనసాగనున్నారు. నవంబర్లోనే మండల దీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. మాలికాపురం దేవి ఆలయానికి ప్రధాన పూజారిగా హరిహరన్ నంబ్రూదిని ఎన్నుకున్నారు.
డ్రా ద్వారానే ఇద్దరు పూజారుల ఎంపిక జరిగింది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా షార్ట్‌లిస్టు చేసిన పూజారుల జాబితా నుంచి డ్రా తీశారు. పండలం రాజ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారుల ముందు డ్రా తీశారు.
అయ్యప్పకు జయరామన్ నంబూద్రి వీరభక్తుడు. ఆయన స్వస్థలం కన్నూరు. ప్రధాన పూజారిగా ఆయన్ను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన కల నెరవేరినట్లు చెప్పారు. శబరిమల స్వామికి సేవ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రధాన పూజారి(మేల్‌సంతి) పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్ 16న ఇద్దరూ బాధ్యతలు స్వీకరించనున్నారు.