చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే తదుపరి బీజేపీ చీఫ్ రేస్‌లో తాను లేనని శుక్రవారం స్పష్టం చేశారు. బీజేపీ నేతలు పార్టీ నాయకత్వ పదవికి పోటీపడరని అన్నామలై తెలిపారు. తామంతా కలిసి పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని చెప్పారు. ‘తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నేను లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు ప్రతిస్పందించను. నేను ఏ రేసులోనూ లేను’ అని కోయంబత్తూరులో మీడియాతో అన్నారు.
కాగా, తమిళనాడులో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నామలై తెలిపారు. పార్టీ ఎదుగుదల కోసం చాలా మంది తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. అందుకే పార్టీకి ఎల్లప్పుడూ మంచి జరుగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. అయితే బీజేపీ అధిష్టానం అన్నామలైకు పార్టీలో మరో కీలక పదవి ఇవ్వవచ్చని తెలుస్తున్నది.
మరోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు బీజేపీ సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. దీంతో బీజేపీతో ఆ పార్టీ తెగదెంపులు చేసుకున్నది. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.