Jyoti Malhotra | హైదరాబాద్ : రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హర్యానకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండేండ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మీడియా పేరుతో హాజరైన జ్యోతి.. రైలు గురించి చెబుతూ వీడియో చిత్రీకరించింది. సికింద్రాబాద్ స్టేషన్ దృశ్యాలతో పాటు రైలు లోపలి దృశ్యాలను కూడా జ్యోతి చిత్రీకరించారు.
పాకిస్థాన్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ఓ ట్రావెల్ బ్లాగర్ సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హర్యానా, పంజాబ్‌వ్యాప్తంగా విస్తరించిన ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో నిందితులంతా ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ చానల్‌ను నడుపుతున్న జ్యోతి మల్హోత్రా అనే మహిళ కూడా నిందితుల్లో ఉన్నారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా వీసా సంపాదించిన జ్యోతి 2023లో పాకిస్థాన్ వెళ్లారు.
తన పర్యటనలో ఆమెకు న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లో పనిచేస్తున్న ఎహ్సాన్ ఉర్ రహ్మాన్ అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. భారత్‌లోని కీలక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె ఐఎస్ఐ ఏజెంట్లకు షేర్ చేసేదని విచారణలో తేలింది. 32 ఏండ్ల గుజాలా గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. వీసా సంబంధ కార్యకలాపాలకు పాల్పడిన మలెర్కోట్లకు చెందిన యమీన్ మొహమ్మద్‌ను, పాకిస్థాన్‌కు భారత దేశ కీలక సమాచారాన్ని చేరవేసిన హర్యానాకు చెందిన పీజీ విద్యార్థి దేవేంద్ర సింగ్ ధిల్లాన్నీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఐఎస్ఐ ఆదేశాలపై డిఫెన్స్ ఎక్స్పోని సందర్శించడం వంటి చర్యలకు పాల్పడిన అర్మాన్ని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్ ISI ఏజెంట్
రెండేళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసిన పాకిస్థాన్ ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా https://t.co/ZsjzqNUNx4 pic.twitter.com/ElhZG8pOji
— Telugu Scribe (@TeluguScribe) May 18, 2025