న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసు తీర్పు సమయంలో.. జస్టిస్ ఉజ్జల్ భూయాన్(Justice Ujjal Bhuyan) కీలక అంశాలను వెల్లడించారు. ఈడీ అరెస్టు విషయంలో కేజ్రీవాల్‌కు స్టే వచ్చిందని, కేవలం అతని బెయిల్‌ను అడ్డుకునేందుకు ఢిల్లీ సీఎంను సీబీఐ అరెస్టు చేసినట్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన అంశంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, మార్చి 2023లో అతన్ని సీబీఐ విచారించినా, అప్పుడు అతన్ని అరెస్టు చేయాలన్న ఆలోచన లేదని, కానీ ఈడీ అరెస్టుపై స్టే ఇవ్వడం వల్లే సీబీఐ యాక్టివ్‌గా మారిందని జస్టిస్ భూయాన్ తన తీర్పులో తెలిపారు.
సీఎం కేజ్రీని సీబీఐ అరెస్టు చేసిన విధానం కేవలం అతన్ని వేధించాలన్న ఉద్దేశంతో జరిగినట్లు ఉందని జస్టిస్ భూయాన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బోనులో చిలుక అని సీబీఐకి ఉన్న చెడు పేరును ఆ ఏజెన్సీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ భూయాన్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. స్వేచ్చగా విహరించే చిలుక తరహాలో సీబీఐ వ్యవహరించాలన్నారు. తనపై వ్యక్తం అయిన అనుమానాలను సీబీఐ నివృత్తి చేసుకోవాలన్నారు.
కేజ్రీకి బెయిల్ ఇచ్చిన తీర్పు సుమారు 60 పేజీలు ఉన్నది. దాంట్లో జస్టిస్ సూర్య కాంత్ 27 పేజీల తీర్పు ఇవ్వగా, జస్టిస్ ఉజ్వల్ భూయాన్ 33 పేజీల తీర్పును రాశారు. సీబీఐ అరెస్టును జస్టిస్ కాంత్ సమర్థించగా, జస్టిస్ భూయాన్ మాత్రం వ్యతిరేకించారు. దర్యాప్తు సమయంలో టార్గెట్ చేసి వేధించడం సరికాదు అని, తమకు కావాల్సిన సమాధానాలను రాబట్టడం సరైన విధానం కాదు అని భూయాన్ తెలిపారు.
సెక్రటేరియేట్‌కు వెళ్లకూడదని, ఫైళ్లపై సంతకాలు పెట్టకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జస్టిస్ భూయాన్ స్పందిస్తూ.. న్యాయ ప్రక్రియలో భాగంగా ఆ అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయలేనని, ఎందుకంటే కేజ్రీపై ఈడీ కేసు కూడా ఉందని తెలిపారు.